Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 52

Viswamitra accepts Sage Vasistha's hospitality !!

|| om tat sat ||

స దృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః |
ప్రణతో వినయాద్వీరో వసిష్ఠం జపతాం వరమ్ ||

తా|| మహాబలవంతుడు వీరుడు అయిన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమము చూచి పరమ సంతోషముతో వినయముగా జపము చేయుటలో శ్రేష్ఠుడైన వశిష్ఠునకు ప్రణమిల్లెను

బాలకాండ
ఏబది రెండవ సర్గమ

మహాబలవంతుడు వీరుడు అయిన విశ్వామిత్రుడు ఆ వసిష్ఠ ఆశ్రమము చూచి పరమ సంతోషముతో వినయముగా జపము చేయుటలో శ్రేష్ఠుడైన వసిష్ఠునకు ప్రణమిల్లెను.

మహత్ముడైన వసిష్ఠుడు విశ్వమిత్రునకు " నీకు స్వాగతము" అని చెప్పి ఆసనము స్వీకరించుటకు అహ్వానించెను . పిమ్మట ఆ మునివరుడు ధీమతుడైన విశ్వామిత్రునిని కూర్చోబెట్టి యథావిధిగా ఫలములను ఇత్యాదులతో పూజరించెను.

ఆ రాజసత్తముడు దగు విశ్వామిత్రుడు వసిష్ఠుని పూజలను గ్రహించి ఆశ్రమములో తపస్సు అగ్నిహోత్రము లసదుపాయములు , శిష్యుల కుశలములను గురించి అడిగెను. అదేవిథముగా వనములోవుండు గణముల గురించి అడిగెను. వసిష్ఠుడు ఆరాజసత్తమునితో అందరూ కుశలమే అని చెప్పెను.

అప్పుడు తపోధనులలో శ్రేష్ఠుడు మహతపోనిథి బ్రహ్మసుతుడు అయిన వశిష్ఠుడు సుఖముగా ఉపవిష్ఠుడైన రాజు విశ్వామిత్రునితో ఇట్లడిగెను.

"ఓ రాజా ! నీవు కుశలమే కదా . ఓ వీరుడా ధార్మికా రాజవృత్తితో ధర్మముగా ప్రజలను అనురంజకముగా పాలించు చున్నావా ? నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా ? శాసనములను బాగుగా నడుపుచున్నారా? ఓ శత్రువులను జయించువాడా నీవు శత్రువులందరినీ జయించితివిగదా ? ఓ పరంతప బలములు , మిత్రులు , కోశములూ కుశలమా ? ఓ అనఘా ! నీ పుత్రులు పౌత్రులూ కుశలమా ?" అని.
ఆ మాటలను విని మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు వినయముతో వసిష్ఠునకు అంతా కుశలమే అని ప్రతుత్తరమిచ్చెను.

అట్లు అత్యంత సంతోషముతో ఆ ధర్మిష్ఠులిద్దరూ చాలాకాలము పరస్పర ప్రీతికరముగా శుభమైన కథాప్రసంగములతో గడిపిరి.

ఓ రఘునందన ! అప్పుడు కథాప్రసంగముల తరువాత భగవన్ వసిష్ఠుడు దరహాసముతో విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. "ఓ మహాబలా ! నీ బలగములకు మరియూ నీకు తగువిథముగా అతిథ్యమును ఇవ్వ దలిచితిని. మీరు నాచే ఇవ్వబడు ఆతిథ్యమును స్వీకరింపుడు. ఓ రాజా నీవు అతిథులలో శ్రేష్ఠుడవు మాకు పూజనీయుడవు".

ఈ విథముగా చెప్పిన మహాముని యగు వసిష్ఠునతో రాజా విశ్వామిత్రుడు " మీప్రియమైన వాక్యములతో ఆతిథ్యము చేయబడినది . భగవన్ ! మీ ఆశ్రమములో ఉన్న ఫలములతో, పాద్యములతో ఆచమనీయములతో , మీదర్శనముతో కూడా అతిథి సత్కారము జరిగినది. ఓ మహాప్రాజ్ఞ ! అన్నివిథములుగా పూజింపతగిన వారిచే మేము పూజింపబడితిమి. వెళ్ళెదను. మీకు నమస్కారము. మమ్ములను మిత్రభావముతో చూడుము" అని.

ఈ విథముగా చెప్పిన ఆ రాజుతో ధర్మాత్ముడు ఉదార స్వభావము కలవాడు అగు వసిష్ఠుడు మరల మరల అభ్యర్థించెను. ఆ గాధియొక్క పుత్రుడు వసిష్ఠునితో అంగీకరించుచూ ఇట్లు పలికెను. "ఓ భగవన్ మునిపుంగవ! మీకు ప్రియమగునట్లే చేయుడు" అని

ఈ విధముగా చెప్పబడిన తపోధనులలో శ్రేష్ఠుడైన వసిష్ఠుడు అప్పుడు కల్మషములను తొలగించు , కల్మషములేని కామధేనువును పిలిచెను.

ఓ శబలా ! త్వరగా రా రా !. నా మాటలను వినుము. రాజర్షి ఆయన బలములకు సత్కారము చేయవలెను. ఎవరెవెరికి ఎట్లు కోరికగలదో ఏటువంటి అర్హతకలదో అట్టి షడ్రస రసముల భోజనముతో పూజింపవలెను. ఓ శబలా ! నేను చెప్పిన విథముగా అది అంతయూ త్వరగా రసాన్నములతో, పానీయములతో లేహ్యములతో కలిసిన అన్నములను త్వరగా సృజింపుము" అని.

ఈ విధముగా రామాయణములో బాలకాండ లో ఏబది రెండవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్ ||


రసాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతమ్ ||
అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర ||

తా|| ఓ శబలా ! నేను చెప్పిన విథముగా అది అంతయూ త్వరగా రసాన్నములతో, పానీయములతో లేహ్యములతో కలిసిన అన్నములను త్వరగా సృజింపుము.